పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చంటూ గత కొద్ది రోజులుగా ఓ వార్త సోషల్‌ మీడియాలో, వార్తా ఛానెళ్లలో వైరల్‌ అవుతోంది. విషయానికొస్తే, యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షల్లో బెంగళూరు లోకల్ బస్సు కండక్టర్ సత్తా చాటాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. ఇక ఇది కూడా పూర్తి చేస్తే అతడు ఏకంగా కండక్టర్‌ నుంచి కలెక్టర్ స్థాయికి చేరిపోతాడు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో, వార్తా ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఓవైపు కండక్టర్ డ్యూటీ చేస్తూనే రోజుకి ఐదు గంటలు చదివి కష్టపడి ఐఏఎస్ పాసయ్యాడంటూ బెంగళూరులో ఓ బస్ కండక్టర్ పై వచ్చిన వార్తలన్నీ ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. కావాలనే అతడు ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేశాడని నిర్థారించుకున్నారు అధికారులు. కండక్టర్ మధు యూపీఎస్‌సీ మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని మధు పేరుతో వచ్చిన ఆ రిజల్ట్ మధు కుమారి అనే బెంగళూరుకు చెందిన వేరే అమ్మాయిదని తేలింది. దీంతో తప్పుడు సమాచారంతో మీడియాను తప్పుదోవ పట్టించిన మధుపై బీఎంటీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యారు. ఐఏఎస్ పాసయ్యానని అందర్నీ మోసం చేసిన మధు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.

అసలు నిజం వెలుగులోకి రావడంతో ఇప్పటివరకు ప్రశంసలు పొందిన మధును ఇప్పుడు సహోద్యోగులే విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యవహార శైలి మంచిది కాదని మధును తిడుతున్నారు. కలెక్టర్ కాబోతున్నానని అందరికీ చెప్పిన మధుపై బీఎంటీసీ యాజమాన్యం చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మధు నిజ స్వరూపం తెలియడంతో నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కండక్టర్ హోదాలో ఉన్న మధు కలెక్టర్ కాబోతున్నానని ప్రజలను, మీడియాను మోసం చేయడం గమనార్హం.