ప్రకాశం: పట్టణంలోని కాశినాయన గుడి వీధిలో వి.సుశీల(42) అనే మహిళ మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. అయితే ఈ హత్య చేసింది విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తులు కాగా, చేయించింది మృతురాలి తమ్ముడిగా ప్రచారం జరుగుతోంది. మృతురాలి తమ్ముడు శ్రీను దుబార, ఇతరత్రా వ్యవహారాలతో ఉన్న ఆస్తిని పోగొట్టుకుని అప్పుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఒంటరి అయిన అక్క ఆస్తిపై కన్ను వేశాడు. కొద్ది కాలంగా ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా అక్క ఆస్తిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో పథకం పన్నాడు.

ఈ క్రమంలో పట్టణానికి చెందిన ఓ మహిళ ద్వారా విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని పరిచయం చేసుకుని సుశీలను హత్య చేసేందుకు రూ.2 లక్షల సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. పథకంలో భాగంగా విజయవాడకు చెందిన యువకుడు అదే ప్రాంతానికి చెందిన మరొకరిని సాయంగా తెచ్చుకొని సుశీలను హత్య చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఒంటరిగా ఉంటున్న సుశీల వద్దకు వెళ్లి ఇంటి పై పోర్షన్‌ అద్దెకు కావాలని పైకి తీసుకెళ్లి దారుణంగా గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది.