క్షణం ,క్షణం టెన్షన్ ..

భారతదేశం మొత్తం హీరోగా కీరిస్తున్న అభినందన్ పాకిస్తాన్ సైన్యం చేతికి దొరకకముందు ఏం చేశాడు.. సినిమాను తలపించే సన్నివేశం ఇది.. పాకిస్తాన్ లో ప్రముఖ పత్రిక డాన్ కధనం ప్రకారం .. అభినందన్ దేశభక్తి, ధైర్యం, పోరాటం, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. శత్రు దేశమైన పాకిస్తాన్ పత్రికే అతడి ధైర్య సాహసాలను ప్రచురించిందంటే అక్కడి పరిస్థితి ఎంత ఉద్విగ్నమో అర్ధమవుతుంది. అభినందన్ ప్రయాణించే యుద్ధ విమానాన్ని పాక్ సైన్యం కూల్చివేసిన తర్వాత ప్యారాచూట్ సాయంతో కింద పడిపోయాడు. ఈ సంఘటన జరిగిన ప్రాంతం హొర్రా గ్రామం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బిమ్బర్ జిల్లాలో వాస్తవాధీన రేఖకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం వుంది. పాక్ లోని మహమ్మద్ రజాక్ చౌదరి అనే స్థానికుడు డాన్ పత్రిక ఇంటర్వ్యూ లో అక్కడ అసలేం జరిగిందో చెప్పాడు.

ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తన ఇంటి ఆవరణలో పని చేసుకుంటుండగా ఆకాశంలో రెండు విమానాలు కూలిపోవడం గమనించానని చెప్పాడు. అందులోనుంచి ప్యారాచూట్ తో కిందిగి దిగిన విమాన పైలట్ వాస్తవాధీన రేఖ వైపు పరుగెత్తడం చూశానని అన్నాడు. ఇది చూసిన వెంటనే గ్రామంలోని యువకులకు సైన్యం వచ్చేవరకూ విమాన శిధిలాల వద్దకు వెళ్లోద్దని చెప్పానని, పైలట్ ను పట్టుకునేందుకు తన వెంట రమ్మని కోరానని అన్నారు. తాము సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఆ పైలట్ పిస్టల్ చేతిలో పట్టుకుని ఉన్నాడని, అక్కడ వున్న యువకులను తాను వుంటున్నది పాకిస్తాన్.. భూభాగమా.. లేక భారత్ భూభాగమా అని అడిగినట్టు చెప్పాడు. ఆ యువకులు తెలివిగా భారత్ భూభాగమేనని చెప్పారని, దీంతో పైలట్ తానూ, భారతీయుడనని, తన పేరు అభినందన్ అని చెప్పి, జైహింద్ అని నినాదం చేశాడని చెప్పాడు. దీంతో కొంతమంది ఆవేశపరులైన యువకులు పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్ అంటూ అభినందన్ పై దాడులు చేయబోయారని, అప్పుడు అభినందన్ తన చేతిలోని పిస్టల్ తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడని చెప్పాడు.

దీంతో తమ గ్రామ యువకులు అతనిపై దాడి చేసేందుకు రాళ్లు తీసుకున్నారని చెప్పాడు. వెంటనే అభినందన్ పిస్టల్ ను తమ గ్రామ యువకుల వైపు చూపుతూ పరుగెత్తాడని చెప్పారు. తమ గ్రామ యువకులు కూడా అతడ్ని వెంటాడారని అన్నారు. ఆ సమయంలో అతను నీళ్ళలోకి దూకి తన వద్దనున్న డాక్యూమెంట్లు, మ్యాపులు అందులో వేసేశాడని తెలిపారు. చేతిలోని పిస్టల్ వదిలి పెట్టాల్సిందిగా తమ గ్రామ యువకులు హెచ్చరించారని నీళ్లలోనుంచి అభినందన్ ను తీసుకొచ్చి, కొట్టారని అన్నాడు. ఈలోగా పాక్ సైనికులు వచ్చి అతడ్ని అదుపులోకి తీసుకున్నారని, లేకపోతే తమ గ్రామ యువకులు అతడ్ని కొట్టి చంపేసి ఉండేవారని తెలిపారు. పాక్ భూభాగంపై పడిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా, శత్రువులకు చిక్కకుండా అభినందన్ యత్నించడం గమనార్హం. తనను ఒక మూక వెంటాడుతున్నప్పటికీ… తన వద్ద ఉన్న వాయుసేన డాక్యుమెంట్లు, మ్యాప్ లు వారికి దొరకకుండా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం. దేశ రక్షణలో మన సైన్యానికి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటిచెబుతోంది. Video ?