ఓవర్ టేక్ ప్రయత్నంప్రాణం బలికొంది

టిప్పర్‌ను ఓవర్‌_టేక్‌ చేసే ప్రయత్నం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దైవ దర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరిన సాఫ్ట్‌వేర్‌ దంపతుల జీవితంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో భార్య అక్కడిక్కడే మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలికి చెందిన ప్రవీణ్‌, రమ్య దంపతులు క్యాప్‌ జెమినీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నారు. శనివారం ఉదయం ఇద్దరూ స్కూటీపై చిరుకూరి బాలాజీ దర్శనం చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో ప్రవీణ్‌ స్కూటీ నడుపుతున్నాడు.

స్కూటీ విప్రో చౌరస్తా వద్దకు రాగానే పక్కనే రోడ్డుపై వస్తున్న టిప్పర్‌ లారీనీ ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్న చేశాడు ప్రవీణ్‌. అదే సమయంలో టిప్పర్‌ పక్కకు మళ్లి స్కూటీపైకి దూసుకు వెళ్లింది. దీంతో స్కూటీ వెనక కూర్చున్న రమ్యపైకి లారీ టైరు ఎక్కటంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్‌కు సైతం తీవ్రగాయాలు అవ్వటంతో అతన్ని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు.