కొన్నాళ్లుగా తనపై వేధింపులకు పాల్పడుతున్న ఓ యువకుడికి ఓ వివాహిత దేహశుద్ది చేసింది. చాన్నాళ్లుగా అతని తీరుపై తీవ్ర అసహనంతో రగిలిపోతున్న ఆమె ఎందుకులే రచ్చ చేయడం అని ఓపిక పడుతూ వచ్చింది. కానీ ఇటీవల అతని చేష్టలు మరీ శృతిమించడంతో ఇక విషయాన్ని భర్తతో చెప్పింది.దీంతో ఇద్దరూ కలిసి అతన్ని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. నల్గొండ పట్టణంలోని అర్జాల బావి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. అర్జాల బావి ప్రాంతంలో నివాసం ఉండే ఓ వివాహిత పట్ల అదే ప్రాంతానికి చెందిన శ్రీ శైలం అనే యువకుడు కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. తరుచూ ఆమె ఇంటి చుట్టూ సంచరించడం..ఇంట్లోకి తొంగి చూడటం చూస్తుండేవాడు. ఇంటి ముందు నుంచి వెళ్తూ అసభ్యకరంగా సైగలు చేసేవాడు. శ్రీ శైలం వేధింపులపై చాలాకాలం ఓపిక పట్టిన ఆమె అతని చేష్టలు శృతిమించడంతో భర్తతో విషయం చెప్పింది. దీంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ఆమె భర్త. శ్రీశైలం తమ ఇంటి చుట్టే తిరుగుతున్నాడని గుర్తించింది. గురువారం శ్రీశైలం తమ ఇంటి వద్దకు రాగానే.. భార్యాభర్తలు అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు.విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు.