రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళపై రైల్వే టిటిఇ, ప్యాంట్రీ సిబ్బంది కలసి

ఢిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళపై రైల్వే టిటిఇ, ప్యాంట్రీ సిబ్బంది కలసి మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుపై రైల్వే శాఖ దర్యాప్తు చేపట్టింది. బాధిత మహిళకు ఐస్‌క్రీమ్‌లో మత్తు మందు కలిపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని అదే రైలులో ప్రయాణించిన మరో మహిళ మంగళవారం రాత్రి ట్వీట్ చేసింది. టిటిఇ, ప్యాంట్రీ సిబ్బంది కలసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, దోషులను అలాగే వదిలేస్తే మరో ప్రయాణికురాలిపై కూడా ఇదే రకంగా అత్యాచారానికి పాల్పడతారని ఆమె తన ట్వీట్‌లో పేర్కొంది. బాధితురాలు ఒక విద్యార్థి. న్యాయ వివాదంలో చిక్కుకుంటే ఇక సాధారణ జీవితం గడపలేనని ఆమె భయపడుతోంది. బాధితురాలు ఇప్పటికే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్ లేకుండా దోషులను శిక్షించగలరా అంటూ సహ ప్రయాణికురాలు రైల్వే మంత్రిని, ఇతర సీనియర్ అధికారులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై ఐఆర్‌సిటిసి తూర్పు జోన్ అధికారులు స్పందించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఈ సంఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు రాంచి డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు.