హైదరాబాద్‌: టీఎస్‌ పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో వదంతులు నమ్మొద్దని ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేపర్‌ లీకేజీ వ్యవహారంపై స్పందించారు. కమిషన్‌లో నమ్మిన వాళ్లే గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దురదృష్టకరమైన వాతావరణంలో ప్రెస్‌ మీట్‌ పెడుతున్నా. వదంతులకు అడ్డుకట్ట వేసేందుకే ఈ మీడియా సమావేశం. దాదాపు 30లక్షల మంది అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ను యూపీఎస్సీ కూడా మెచ్చుకుంది. ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు సగటున ఏడాదికి 4వేల ఉద్యోగాలు భర్తీ చేసేవారు. కానీ, తెలంగాణ వచ్చాక దాదాపు 35వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుతం దాదాపు 25వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ అనేక కొత్త విధానాలు తెచ్చింది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మల్టిపుల్‌ జంబ్లింగ్‌ విధానం తెచ్చాం. ప్రశ్నలు, సమాధానాలు మల్టిపుల్‌ జంబ్లింగ్‌ చేశాం. అక్టోబరు 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించాం. పరీక్ష ముగిసిన తర్వాత ఓఎంఆర్‌ షీట్‌తో పాటు, ప్రిలిమినరీ కీ ని కూడా వెబ్‌సైట్‌లో పెట్టాం. అభ్యంతరాల స్వీకరణకు 5రోజుల సమయం ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో అక్రమాలు జరగొద్దనే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పటి వరకు 26 నోటిఫికేషన్లు ఇచ్చాం. 7 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు పూర్తయ్యాయి. 8వ పరీక్ష టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌. 175 పోస్టులకు దాదాపు 33వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు ఒక రోజు ముందు పేపర్‌ లీకైనట్టు సమాచారం వచ్చింది. వెబ్‌సైట్‌ నుంచి ఎవరో సమాచారం హ్యాక్‌ చేసి దుర్వినియోగం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం.

న్యాయనిపుణుల సలహా మేరకు నిర్ణయం:

రాజశేఖర్‌రెడ్డి అనే నెట్‌ వర్క్‌ ఎక్స్‌పర్ట్‌ దాదాపు ఆరేడేళ్ల నుంచి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా ఇక్కడ పనిచేస్తున్నారు. అతనికి అన్ని ఐపీ అడ్రస్‌లు తెలిసే అవకాశం ఉంటుంది. అతనికి ఉన్న పరిజ్ఞానంతో కీలక సమాచారం యాక్సిస్‌ చేసినట్టు తేలింది. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్ దాన్ని దుర్వినియోగం చేసి రేణుక తదితరులకు ప్రశ్నపత్రాలు చేరవేశారు. పోలీసుల దర్యాప్తులో 9మంది నిందితులుగా తేలింది. ప్రవీణ్‌ రూ.10లక్షలకు పేపర్లు అమ్ముకున్నాడని దర్యాప్తులో తేలింది. దీనిపై లీగల్‌ ఒపినీయన్‌ తీసుకుని పరీక్ష రద్దు చేయాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఏఈ పరీక్షపై నివేదిక రావాల్సి ఉంది. చర్చించి రేపు నిర్ణయం తీసుకుంటాం.

నా పిల్లలు ఎవరూ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాయలేదు:

పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నా పిల్లలు ఎవరూ కూడా గ్రూప్‌-1 పరీక్ష రాయలేదు. వదంతులకు కూడా ఒక హద్దు ఉంటుంది. ప్రవీణ్‌కు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమే. 103 మార్కులే అత్యధికం కాదు. ఈ కేసులో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ఐదుగురు ఉన్నారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం జరుగుతుంది. పూర్తిస్థాయి నివేదిక వచ్చాక వాస్తవం తెలుస్తుంది. గ్రూప్‌-1 మెయిన్స్‌ జూన్‌ 5న నిర్వహించాలని నిర్ణయించాం ’’ అని జనార్దన్‌రెడ్డి తెలిపారు..