ప్రేమ పేరుతో గర్భవతిని చేసి ఆపై ప్రియుడు ముఖం చాటేయడంతో గిరిజన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కౌటాల మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం: గురుడుపేట గ్రామానికి చెందిన ఎర్మ సత్తయ్య భక్కుబాయి దంపతులకు కూతురు అంజలి(19) ఇంటర్‌ పూర్తి చేసి మంచిర్యాలలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో లాబ్‌ టెక్నిషీయన్‌గా పని చేస్తుంది. ఇదే క్రమంలో అదే ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నిషియన్‌గా విధులు నిర్వహిస్తున్న చింతలమానెపల్లి మండలంలోని రుద్రాపూర్‌ గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో శరీరకంగా దగ్గరయ్యారు.

దీంతో అంజలి గర్భవతి కావడంతో ఆ విషయాన్ని ప్రియుడికి తెలిపింది. పెళ్లి చేసుకోవాలని కోరడంతో ముఖం చాటేశాడు. తాను మోసపోయానని మూడు నెలల క్రితం స్వగ్రామమైన గురుడుపేటకు వచ్చింది. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతోంది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. బంధువులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో కాగజ్‌నగర్‌ మండలంలోని ఈజ్‌గాంలోని ప్రైవేట్‌ క్లినిక్‌లో చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాగజ్‌నగర్‌కు శనివారం రాత్రి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందింది.

డీఎస్పీ విచారణ:

యువతి మృతిచెందిన వార్తను తెలుసుకున్న కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్దే స్వామి, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ గురుడుపేట గ్రామానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్‌(టి) సామాజిక ఆసుపత్రికి తరలించారు.