కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో చికెన్‌ మొదలైన పౌల్ట్రీ ఉత్పత్తులను తినవచ్చా అన్న అంశం మీద సందిగ్ధం నెలకొని ఉంది. కాగా చికెన్‌ తదితర ఉత్పత్తుల వినియోగం క్షేమమేనంటూ కేంద్ర పశుసంరక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌ మాలిక్, పౌల్ట్రీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సలహాదారు విజయ్‌ సర్దానాకు ఓ లేఖ వ్రాసారు.

Advertisement

నావెల్‌ కరోనా వైరస్‌ 2019 వ్యాప్తికి పౌల్ట్రీ ఉత్పత్తులు దోహదం చేస్తాయనటానికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ ఆధారాలు లేవని ఆయన ఈ లేఖలో వివరించారు. ఇది వరకు 2002-03లో సార్స్‌, 2012-13లో మెర్స్‌ వ్యాధులు ప్రబలినప్పుడు కూడా పౌల్ట్రీ ఉత్పత్తులు కారణం కాలేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను గురించి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, చికెన్‌ మొదలైన పౌల్ట్రీ ఉత్పత్తుల వినియోగం క్షేమమేనని ఆయన చెబుతున్నారు.

‘వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ యానిమల్‌ హెల్త్‌’ కూడా, కరోనా వైరస్‌ మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తించిందని, ఈ వ్యాధి విస్తరణకు జంతువులు కారణం కాకపోవచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో చికెన్‌ వంటి పౌల్ట్రీ ఉత్పత్తుల వాడకం క్షేమమేనని, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటివి సూచించిన సాధారణ శుభ్రత, ఆరోగ్య నియమాలను పాటించటం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని కూడా ప్రవీణ్‌ మాలిక్ తెలిపారు.