కల్తీ మద్యం కాటేసింది. కల్తీ మద్యం కేసులో మృతుల సంఖ్య పెరిగింది. చనిపోయిన వారి సంఖ్య 102కి పెరిగింది. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. అసోంలోని గోలాఘాట్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులంతా రోజువారీ కూలీలు.. రోజంతా టీ తోటలో పనిచేసి అలసిపోయిన వాళ్లు కష్టాన్ని మరిచిపోవడానికి సాయంత్రం కాస్త మద్యాన్ని తాగారు. ఆ మద్యమే వారి పాలిట యమపాశమైంది. కష్టజీవుల ప్రాణాలను కాటేసింది.
సాల్‌మిరా టీ తోటలో పనిచేసే కూలీలు గురువారం(ఫిబ్రవరి-21-2019) సాయంత్రం మద్యం తాగారు. తాగిన కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. అస్వస్థతకు గురైనవారిని ఆస్పత్రికి తరలిస్తుండగా 12మంది చనిపోయారు. గోలాఘాట్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 38మంది మృతిచెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో జోరాట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరికొందరు గోలాఘాట్‌లోనే చికిత్స పొందుతున్నారు.
బాధితులంతా ఓ వ్యాపారి నుంచి నాటు సారా కొనుగోలు చేశారని పోలీసులు గుర్తించారు. 200మంది మద్యం తాగినట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కల్తీ సారా తయారు చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేసింది. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2 వారాల కిందటే ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్తీ మద్యం సేవించి 100మంది చనిపోయారు.