ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసేందుకు ఒక కస్టమర్ చెప్పిన వింత కారణానికి జొమాటో ఫుడ్ డెలివరీ సర్వీస్ ఇచ్చిన అద్భుతమైన సమాధానం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. అమిత్ శుక్లా అనే కస్టమర్ జొమాటో సర్వీస్ ద్వారా ఫుడ్ అర్డర్ చేశాడు. అయితే ఒక హిందూయేతర బాయ్‌ను ఫుడ్ డెలివరీకి కేటాయించినందుకు తాను ఆర్డర్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు అతను ట్వీట్ పెట్టాడు. రైడర్‌ను మార్చలేమని చెప్పడంతోపాటు క్యాన్సిల్ చేస్తే డబ్బులు రిఫండ్ ఇవ్వలేమని కూడా జొమాటో చెప్పిందని, డెలివరీని తీసుకోవాలని తనను ఒత్తిడి చేయలేరని, తనకు అది అక్కర్లేదని అతను ట్వీట్ చేశాడు. ఇది జరిగిన కొద్ది సేపటికి జొమాటో ఇండియా ధీటుగా సమాధానమిచ్చింది. ఆహారానికి మతం ఉండదు అంటూ ట్వీట్ చేసింది. అనంతరం జొమాటో వ్యవస్థాపకుడు దీపీందర్ గోయల్ మరో ట్వీట్ చేస్తూ భారతదేశ సిద్ధాంతాలు, భిన్న సంస్కతులకు చెందిన కస్టమర్లు, భాగస్వాములను చూసి మేము గర్విస్తున్నాము. మా విలువలకు అవరోధం కల్పించే వ్యాపారాన్ని కోల్పోయినందుకు మేము చింతించబోము అంటూ గోయల్ చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. మతం కారణంగా ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన శుక్లాపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.