ఒకరి మృతి ,మరో ముగ్గురికి తీవ్రగాయాలు

హుజూరాబాద్‌-పరకాల ప్రధాన రహదారిపై శనివారం అర్ధరాత్రి హుజూరాబాద్‌ మండలం కందుగుల గ్రామ సమీపంలోని కాకతీయ ప్రధాన కాలువలో ఓ కారు అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్థులు, పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం… శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన అమ్ముల శ్రీకాంత్‌ (19), రాధారపు రాజేష్‌, ఇదే మండలంలోని మెట్‌పల్లికి చెందిన ఇట్టినేని శివకుమార్‌, తాటిపాముల రోహిత్‌లు కలిసి ఓ కారులో మెట్‌పల్లి నుంచి కమలాపూర్‌కు వెళ్తున్నట్లు వివరించారు.

కారును రాజేశ్‌ నడుపుతున్నట్లు తెలిపారు. అతి వేగంగా అజాగ్రత్తగా నడపడంతో కాలువలో పడిపోయినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ వాసంశెట్టి మాధవి, ఎస్సై మామిడాల చంద్రశేఖర్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. శ్రీకాంత్‌ పరిస్థితి విషమంగా మారటంతో హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించగా, తరలించే క్రమంలో మార్గంమధ్యలో మృతి చెందినట్లు పేర్కొన్నారు. శ్రీకాంత్‌ తండ్రి సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.