రోడ్డు దాటుతున్న వృద్దురాలిని వేగంగా వచ్చిన టాటా మ్యాజిక్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి బాపూజీనగర్ ప్రధాన రహదారిపై జరిగింది . ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం. ఇంటికి ఆడబిడ్డ రావడంతో కోడిగుడ్లు తీసుకురావడానికి బాపూజీనగర్ చెందిన వెల్దండి భారతి బయటకు వచ్చింది . ఇంటి ఎదుట ఉన్న దుకాణంలో కోడిగుడ్లు తీసుకుని రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన టాటా మ్యాజిక్ వాహనం ఆమెను ఢీకొంది . వాహనం ముందు భాగంలో భారతి చిక్కుకోగా- 20 మీటర్ల మేరకు ఈడ్చుకెళ్లింది . స్థానికులు పరిశీలించగా ఆమె అప్పటికే మృతిచెందింది . డ్రైవర్ వాహనంను వదిలేసి పరారీలో ఉండగా. కాజీపేట సీఐ అజయ్ , ఎస్సై దేవేందర్లు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టమార్టమ్ నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు . మృతురాలి భర్త లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు . మృతురాలికి ఇద్దరు కుమారులు ఓ కూతురు ఉన్నారు .