కాజీపేట : చీకటిలో, రైలుపట్టాల పక్కన, రక్తపు మడుగులో ఓ యువకుడు ఐదు గంటలు పడి ఉన్నాడు. అతని పక్క నుంచి రైళ్లు వెళుతున్నా భయంతో చేసేది లేక అలాగే పడి ఉన్నాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట టౌన్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ ఘటన హృదయాన్ని కదిలిస్తుంది. కర్నూల్‌ జిల్లా కేంద్రానికి చెందిన పటాన్‌ ముస్తాఫా(23) అనే యువకుడు హజరత్‌ నిజాముద్దీన్‌ నుంచి కాజీపేట వైపు వస్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. రద్దీ అధికంగా ఉండడంతో అతను తలుపు వద్ద కూర్చున్నాడు. కాజీపేట టౌన్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోకి వచ్చాక సుమారు బుధవారం అర్ధరాత్రి తర్వాత ఒంటి గంట సమయంలో జారి కింద పడ్డాడు. ఈ ఘటనలో అతని రెండు కాళ్లు రైలు చక్రాల కిందపడి తెగిపోయాయి. రక్తం ఎక్కువగా పోవడంతో కదల్లేని స్థితిలో ఉండి సహాయం కోసం అరిచాడు. 100 నంబరుకు కూడా ఫోన్‌ చేసినట్లు అతని వద్ద లభించిన చరవాణిలో ఉంది. కానీ ఘటనా స్థలం అతనికి తెలియకపోవడంతో సిబ్బందికి స్పష్టంగా చెప్పలేదనట్లుగా తెలుస్తోంది. గురువారం ఉదయం చుట్టుపక్కల వారు ఇతణ్ని చూసినా సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని స్పష్టమవుతుంది. కాజీపేటకు చెందిన ట్రాక్‌మెన్లు పట్టాలను సరి చేస్తూ వెళ్తుండగా ఇతను అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసి ఉదయం 7 గంటలకు 108కు ఫోన్‌ చేశారు. 108 సిబ్బంది సుధ, అమర్‌నాథ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని అతనికి ప్రథమ చికిత్స చేసి, ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శరీరంలో రక్తం ఎక్కువగా పోవడంతో ముస్తాఫా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు….