వారు ఇరువురు ఫేస్‌బుక్‌లో కలిశారు. ఒకరినొకరూ ఇష్టపడ్డారు. ఒకటిగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. మూడు సంవత్సరాల కాలం కలిసి జీవించారు. ఏం జరిగిందో తెలియదు కాని సదరు మహిళ ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపూర్ మండలంలోని పొరండ్ల గ్రామానికి చెందిన దుర్గం పవన్ మెడికల్ రిప్రజెంటెటివ్‌గా పనిచేస్తుండగా అతనికి భద్రాచలంకు చెందిన విమల (27)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారు ఒకరినొకరు ఇష్టపడ్డారు.

కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా అప్పటికే పవన్‌కు రెండు వివాహలు జరిగ్గా రెండింటిలోనూ అతను విడాకులు తీసుకున్నాడు. అదేవిధంగా విమలకు సైతం అప్పటికే రెండు వివాహాలు జరిగి ఆమె కూడా విడాకులు తీసుకోవడం జరిగింది. పవన్ మొదట ప్రేమ వివాహం చేసుకోగా తరువాత తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారు. పవన్ మొదటి భార్య మంజుభార్గవికి ఒక కొడుకు ఉండగా రెండవ భార్య సంతోషికి ఒక కుమార్తె ఉంది. ఇరువురితో విడాకులు తీసుకున్నప్పటికి పిల్లల పోషణ బాధ్యతను పవన్ నిర్వహిస్తున్నాడు. కాగా విమలకు మాత్రం పిల్లలు లేరు. ఫేస్‌బుక్‌లో పరిచయమై కలిసి జీవించాలని నిర్ణయించుకున్న పవన్, విమల మూడు సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నారు.

నగరంలోని కట్టరాంపూర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని అందులో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉద్యోగ బాధ్యతల నిమిత్తం వరంగల్‌కు వెళ్ళిన పవన్ ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో విమల ఉరివేసుకుని కనిపించింది. నిర్ఘాంతపోయిన అతను చుట్టుపక్కల వారి సహకారంతో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు సమచారం అందించగా పోలీసులు వచ్చి విచారణ జరిపించారు. శవ పంచనామా తరువాత పోస్టుమార్టం కోసం విమల మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విమల ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదని ఆమె పుట్టింటివారు వచ్చిన తరువాత తెలిసే ఆవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సంఘటన జరిగిన చుట్టుపక్కల నివసించే వారు మాత్రం వారిని గురించి ఏలాంటి సమాచారం ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మృతురాలు విమల ఎప్పుడు ఇంటి నుండి బయటికి వచ్చేది కాదని తెలియజేస్తున్నారు.