లేడీ సింగం, దబాంగ్‌ కాప్‌గా పేరొందిన జున్మోనీ రభా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఓ కంటెయినర్‌ ట్రక్కు ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. నాగోవ్‌ జిల్లా కాలియాబోర్‌ సబ్‌ డివిజన్‌లో సరుభుగియా గ్రామం వద్ద ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో పెట్రోలింగ్‌ వాహనం ఆ యాక్సిడెంట్‌ను గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్‌ పరారయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఆ ట్రక్కును పోలీసులు సీజ్‌ చేశారు. సెక్యూరిటీ లేకుండానే ఆమె ప్రయాణం చేయగా ఆ ప్రయాణం వివరాలు తమకూ తెలియదని కుటుంబ సభ్యులు చెప్తుండడం గమనార్హం. జున్మోని రభా ధైర్యశాలి అధికారిణిగా పేరుంది. గతంలో మోరికోలాంగ్‌ పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌లో ఎస్సైగా పని చేశారు. గతంలో ఎంతో సంక్షిష్టమైన కేసుల్ని సాహసోపేతంగా డీల్‌ చేశారామె.

అదే సమయంలో ఆమెపై పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ఆ సమయంలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డవాళ్లపై ఉక్కుపాదం మోపారామె. ఆ క్రమంలో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడ్డ తనకు కాబోయే భర్తను(అప్పటికే ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది కూడా) సైతం అరెస్ట్‌ చేసి ప్రశంసలు అందుకున్నారామె. అయితే గత జూన్‌లో ఆ అవినీతిలో ఆమెకు భాగం ఉందంటూ అభియోగాలు రావడంతో ఆమె అరెస్ట్‌ అయ్యారు. ఆపై సస్పెన్షన్‌ వేటు పడింది. సస్పెన్షన్‌ ముగియడంతో తిరిగి ఆమె డ్యూటీలో జాయిన్‌ అయ్యారు కూడా. 2022 జనవరిలో బీజేపీ ఎమ్మెల్యే అమియా కుమార్‌ భుయాన్‌తో ఆమె జరిపిన ఫోన్‌ సంభాషణ లీక్‌ కావడం కూడా పెను దుమారమే రేపింది..