తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొన్ని చోట్ల బ్యాలెట్ పాత్రలకు చెదలు పట్టడంతో లెక్కింపును నిలిపివేసారు. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో జగిత్యాల జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జగిత్యాలలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదని ఓ ప్రబుద్దుడు ఉత్తరం రాసి బ్యాలెట్ బాక్స్‌లో వేశాడు. ఓట్ల లెక్కింపు జరుపుతున్న సమయంలో అధికారాలకు ఆ ఉత్తరం తారసపడింది.

ఆ ఉత్తరంలో , ”సీఎం కేసీఆర్ గారికి వ్రాయునది ఏమనగా నేను జగిత్యాల జిల్లా వాసిని. మా జగిత్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదు. దాని వల్ల మా జిల్లా వాసులు వేరే జిల్లాకు వెళ్లి మరీ కింగ్ ఫిషర్ బీర్లు తాగుతున్నారు. కావున మా యందు దయతలచి మాకు కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉంచగలరు. నోట్: కింగ్ ఫిషర్ బీర్ల కోసం మా జగిత్యాల జిల్లాను కరీంనగర్‌లో విలీనం చేయగలరు. ఇట్లు జగిత్యాల జిల్లా వాసులు” అని రాసి ఉంది. ఈ ఉత్తరం చూసిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.