వరంగల్ నగరంలో నిర్మాణంలో ఉన్న ఆర్వోబి వద్ద సెంట్రింగ్ కర్ర మీద పడి ఓ మహిళ మృతిచెందింది . వివరాల్లోకి వెళ్తే .. వరంగల్ రైల్వే గేటు వద్ద కొంత కాలంగా ఆర్వోబీ పనులు చేస్తున్నారు . ఈ సందర్భంగా బ్రిడ్జికి అమర్చిన జాయింట్ సెంట్రింగ్ కర్రలను పైనుంచి కార్మికులు ఊడదీస్తున్నారు ఊడిన కర్రలు కింద పడేలా ఐరన్ గ్రిడ్లు ఏర్పాటు చేశారు . ఈ క్రమంలో ఒక కర్ర గ్రిడ్ వెల్డింగ్ చేసిన ఇనుప చువ్వకు తగిలి రోడ్డుపై అప్పుడే నడుచుకుంటూ వెళ్తున్న ధర్మసాగర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి ( 70 ) తలపై పడింది . ఆమె తలపగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది . జనం భారీగా గుమిగూడారు . ఏసీపీ నర్సయ్య , సీఐ జీవన్ రెడ్డి ట్రాఫిక్ సీఐ సత్యనారాయణలు సంఘటన స్థలానికి చేరుకున్నారు . మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్ , అధికారులపై మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఎంజీఎంకు తరలించారు . శాంతినగర్లో ట్రాలీ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్న కొడుకు స్వరాజ్యంను చూసేందుకు వచ్చిన లక్ష్మీ కుమార్తె దగ్గరకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది . విషయం తెలిసిన కొడుకు , కుమార్తెలు అకుడికి చేరుకుని బోరున విలపించారు …