27ఏండ్ల వయసులో ప్రారంభించి పెంచిన బిస్లెరీ వాటర్‌ను ఆ సంస్థ చైర్మన్‌ రమేశ్‌ చౌహాన్‌ అమ్మకానికి పెట్టారు. 4 లక్షలతో ప్రారంభించి 7 వేల కోట్ల డీల్‌ చేసుకునే స్థాయికి బిస్లెరీ ఎదిగిందంటే రమేశ్‌ ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. గోల్డ్‌ స్పాట్‌, లిమ్కా, థమ్స్‌ అప్‌ కూల్‌డ్రింక్స్ను కోకాకోలాకు విక్రయించి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు బిస్లెరీని అమ్మకానికి పెట్టారు ఆ సంస్థ చైర్మన్‌ రమేశ్‌ చౌహాన్‌. బిస్లెరీ ఇంటర్నేషన్‌ను టాటా కన్స్యూమర్‌ ప్రాడక్ట్స్‌ లిమిటెడ్‌కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

దాదాపు రూ.6000-7000 కోట్ల ఒప్పందం జరుగుతున్నట్లు మార్కెట్‌ వర్గాల ద్వారా తెలుస్తున్నది. తన కూతురు బిస్లెరీ వాటర్‌ బిజినెస్‌ చూసుకోననడం వల్లనే అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు రమేశ్‌ చౌహాన్‌ చెప్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. బిస్లెరీ ఇంటర్నేషనల్‌ కింద బిస్లెరీ మినరల్‌ వాటర్‌తోపాటు హిమాలయన్‌ స్ప్రింగ్‌ వాటర్‌, ఫ్రీజ్‌ డ్రింక్‌, హ్యాండ్‌ ప్యూరిఫయర్‌ ఉత్పత్తులు కూడా ఉన్నాయి.