కూతురు భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని అంత్యక్రియలకు హాజరైన మామ కార్యక్రమాలు ముగిశాక మద్యం తాగుదామని భావించాడు. అయితే పొరపాటున అల్లుడు పురుగు మందు కలుపుకొని తాగిన మద్యం సీసాలోని మందే తాగడంతో ఆయన కూడా కన్నుమూయడం ఆ కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది.

Advertisement

ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. జిల్లాలోని మల్హర్‌ మండలం పెద్దతూండ్లకు చెందిన పోలు రవి(45) చిన్న కుమార్తెను కాటారానికి చెందిన మద్ది నాగరాజు మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే, నాగరాజు అప్పుల బాధతో మద్యంలో పురుగు మందు కలుపుకుని ఈనెల 6న తాగాడు. చికిత్స పొందుతూ 7న మృతి చెందాడు.

దీంతో రవి దంపతులు నాగరాజు అంత్యక్రియల కోసం కాటారానికి వచ్చారు. శుక్రవారం రాత్రి అంత్యక్రియలు ముగి శాక మద్యం బాటిల్‌ను తెచ్చుకుందామని వైన్స్‌కు వెళ్లే క్రమంలో నాగరాజు బెడ్‌రూంలో మద్యం సీసా కనిపించింది. అది సాధారణ మద్యమే అనుకున్న రవి తాగాడు. కానీ అదే సీసాలో నాగరాజు పురుగు మందు కలిపి తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియదు. దీంతో ఆ మందు తాగగానే రవి సైతం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు. కాగా, రవి, నాగరాజు మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు.