పంద్రాగస్టు తర్వాత అసలైన పాలన మొదలవుతుందని చెప్పిన సీఎం కేసీఆర్‌! ఆ దిశగా వేగం పెంచారు. రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించడానికి నిర్ణయించారు. మంచిరోజైన శుక్లపక్షం దశమి రోజు అదివారం మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. కేబినెట్ విస్తరణలో కేటీఆర్, హరీశ్, పువ్వాడఅజయ్, గంగుల కమలాకర్, సబిత, సత్యవతి రాథోడ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవాళ సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాజ్‌భవన్‌లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర్‌రాజన్‌కు కేబినెట్‌ ప్రక్షాళనపై సీఎం సమాచారం ఇచ్చారు. ఆమె గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త మంత్రుల చేత సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. కేబినెట్‌ విస్తరణలో బెర్త్‌లు ఎవరికి దక్కుతాయనే విషయంలో టీఆర్‌ఎస్‌ ముఖ్యుంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యాక రాత్రి 7 గంటలకు సిఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. 2019-20కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదనల్ని మంత్రివర్గం ఆమోదించనుంది. కేబినెట్ భేటీకి ముందే నూతన మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖలను ముఖ్యమంత్రి పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం ఉంది.