జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుటుంబసభ్యులు మాదాపూర్‌లో ట్రాఫిక్ పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో వైసీపీ ఎమ్మెల్యే సతీమణి విమలా భానుతోపాటు కుమార్తె, అల్లుడు ఉన్నారు. మహిళలను నెట్టడం సరికాదని.. సీఎం కేసీఆర్‌తో చెప్పి సస్పెండ్ చేయిస్తానని ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మాదాపూర్ ఖానామిట్ట వద్ద ట్రాఫిక్ పోలీసులు విధినిర్వహణలో ఉన్నప్పుడు కొన్ని వాహనాలను ఆపారు. ఆ వాహనాల్లో ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడు ప్రసాద్ వాహనం కూడా ఉంది. పోలీసులు తమ వాహనాన్ని అన్యాయంగా ఎక్కువసేపు ఆపారంటూ ప్రసాద్ పోలీసులతో గొడవపడ్డారు. దీంతో పోలీసులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ప్రసాద్ వినకుండా ఘర్షణకు దిగుతూ.. విధుల్లో ఉన్న ట్రిఫిక్ ఎస్ఐపై దాడి చేసి కాలితో తన్నారు. ఎస్ఐ పిర్యాదు మేరకు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మాదాపూర్ పీఎస్‌కు తరలించారు. ఇది జరిగిన కొద్ది నిముషాలకే ఎమ్మెల్యే ఉదయభాను కుటుంబసభ్యులు వచ్చి ఎస్ఐ రాజగోపాల్ రెడ్డితో గొడవకు దిగారు. వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.