అందుకే అమ్మ ప్రేమ అనంతం అంటారు.

కుమారుడు చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆ తల్లి కలత చెందింది. పలుమార్లు మందలించినా పద్ధతి మార్చుకోలేదు, చదువును మధ్యలోనే ఆపేసి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. దీంతో విసిగివేసారిన ఆ తల్లి చనిపోవాలని నిర్ణయించుకుని టాయిలెట్లు క్లీన్‌ చేసే ద్రావణాన్ని తాగింది. అది చూసిన కుమారుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మందనపల్లి గ్రామానికి చెందిన నర్మెట్ట వెంకటేశ్‌ – చంద్రకళ దంపతుల కుమారుడు బాలు ఇటీవల పాల్‌టెక్నిక్‌ డిప్లమా చదువు మధ్యలో మానేసి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదు. వెంకటేశ్‌ ఆటోడ్రైవర్, చంద్రకళ ఉపాధి హామీలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది.

వెంకటేశ్‌ ఉదయం బయటకు వెళ్లగా, చంద్రకళ కొడుకును మందలించింది. కుమారుడి విషయంలో తీవ్ర మనస్తాపం చెందిన చంద్రకళ టాయిలెట్లు క్లీన్‌ చేసే ఫినాయిల్ తాగింది. భయాందోళనకు గురైన బాలు కూడా చంద్రకళ వదిలేసిన మిగతా ఫినాయిల్‌ను తాగాడు. ఇరుగుపొరుగు వారు గమనించి 108 ద్వారా ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరినీ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని తెలిసింది.