ఆపిల్ సంస్థ ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో వార్షిక సదస్సు ఏర్పాటు చేసి కొత్త ఫోన్లను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఆపిల్ వార్షిక సదస్సు మంగళవారం రోజున కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ ఆవిష్కరించారు. ఈ ఫోన్ల ధరలు భారత్‌లో ఇలా ఉండబోతున్నాయి.

భారత మార్కెట్లో ఐఫోన్‌ 11 ధర రూ.64,900 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్‌ 11 మొత్తం మూడు వేరియంట్లలో లభించనుంది. 64జీబీ వేరియంట్‌ ధర రూ.64,900 కాగా.. 128 జీబీ వేరియంట్‌ ధర రూ.69,900, 256జీబీ వేరియంట్ ధర రూ.79,900గా నిర్ణయించింది. ఇక ఐఫోన్‌ 11 ప్రో ధర రూ.99,900, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ ధర రూ.1,09,900గా ఉండనున్నట్లు యాపిల్‌ వెల్లడించింది. అమెరికా సహా ఇతర దేశాల్లో ఈ నెల 20 నుంచి వీటి అమ్మకాలు మొదలుకానున్నాయి. భారత్‌లో మాత్రం సెప్టెంబరు 27 నుంచి కొత్త ఐఫోన్లు వినియోగదారులకు అందుబాటులో రానున్నాయి. ఐఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్‌లను కూడా యాపిల్‌ ఈ కార్యక్రమంలో ఆవిష్కరించింది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 5(జీపీఎస్‌) ధర రూ.40,900 నుంచి, వాచ్‌ సిరీస్‌ 5(జీపీఎస్‌+సెల్యూలార్‌) ధర రూ.49,900 నుంచి ప్రారంభం కానుంది!!