• క్రికెటర్ భోగి శ్రావణి ఇంటిని కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భోగి శ్రావణి వాళ్ళ తండ్రి బి.మల్లేశ్‌తో కలిసి నివసిస్తున్నారు. ఆమె ఉంటున్న పురాతన ఇల్లు ఏ క్షణంలో అయినే కూలిపోయే ప్రమాదం ఉందని ముందుగా నోటీసులు జారీ చేసి, బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో GHMC అధికారులు కూల్చి వేశారు. ఈ విషయమై భోగి శ్రావణి తుకారాం గేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా, శ్రావణి తండ్రి మల్లేష్ ప్లంబర్ పని చేస్తుండగా, ఇల్లు కూల్చివేయడంతో పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్‌కు షిఫ్ట్ అయ్యారు.

గత 35 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నట్లు శ్రావణి తెలిపింది. ఇంటి వెనుక గోడ కూలిపోయేలా ఉందంటూ కొన్ని రోజుల క్రితం మాకు జీహెచ్ఎంసీ నుంచి నోటీసు వచ్చింది. దానిని సరి చేసినప్పటికీ, ఆ గోడను పరిశీలన చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు రాకపోగా, ఒక్కసారిగా ఇంటిపై వచ్చి, వస్తువులను బయట పడేసి చూస్తుండగానే ఇంటిని కూల్చేశారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఈనెల 15 నుంచి పుదుచ్చేరి జరిగే మహిళల టీ-20 టోర్నమెంట్‌లో తాను పాల్గొనాల్సి ఉందని, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను క్రికెట్ ఆడాలా? లేక తన ఇంటి కోసం పోరాడాలో తెలియట్లేదని శ్రావణి బాధ పడితుంది.