లండన్‌: క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ విశ్వవిజేతగా అవతరించింది. లార్డ్స్‌ వేదికగా ఆఖరి వరకు హోరాహోరీగా జరిగిన తుదిపోరులో కివీస్‌పై ఇంగ్లిష్‌ జట్టు సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. దీంతో తొలిసారిగా వరల్డ్‌ కప్‌ను అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ ఎనిమిది వికెట్లను కోల్పోయి సరిగ్గా 241 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ ఫలితం సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 15 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో కివీస్‌ కూడా15 పరుగులు చేసింది.

అంతకుముందు బెన్‌ స్టోక్స్‌(84*), జోస్‌ బట్లర్‌(59) అర్ధశతకాలతో రాణించారు. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్లలో జాసన్‌ రాయ్‌ 17, బెయిర్‌ స్టో 36, జోయ్‌ రూట్‌ 7, మోర్గాన్ 9, క్రిస్‌ వోక్స్‌ 2, ప్లంకెట్‌ 10 పరుగులు చేశారు. ఆఖరి వరకు క్రీజ్‌లో నిలబడిన స్టోక్స్‌ను ఇంగ్లాండ్‌ను విజయపథంలో నడిపించాడు. ఫెర్గ్యూసన్‌ 3, నీషమ్‌ 3.. హెన్రీ, గ్రాండ్‌హోమ్‌ చెరో వికెట్‌ తీశారు.

కట్టుదిట్టంగా వేసినా.. ఆచితూచి ఆడారు

ఇంగ్లాండ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేసినా.. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడి గౌరవప్రదమైన స్కోరును సాధించారు. కివీస్‌ ఓపెనర్‌ నికోల్స్‌(55) అర్ధశతకంతో రాణించగా.. లాథమ్‌(47), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(30) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మన్లు తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. గప్తిల్‌ 18, రాస్‌ టేలర్‌ 15, జేమ్స్ నీషమ్‌ 19, గ్రాండ్‌హోమ్‌ 16, హెన్రీ 4, శాంట్నర్ 5* పరుగులు చేశారు. ఇంగ్లిష్‌ బౌలర్లలో ప్లంకెట్‌ 3, వోక్స్‌ 3, వుడ్‌, ఆర్చర్‌ చెరో ఒక వికెట్‌ పడగొట్టారు.