ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలోని తూటికుంట్ల గ్రామంలో గత ఏడాది అక్టోబర్‌ 21న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఆరున్నర నెలల తర్వాత కేసు చిక్కుముడి వీడింది. సదరు వ్యక్తి మృతికి ఆయన భార్య, ప్రియుడు విషప్రయోగం చేయడమే కారణమని తేల్చిన పోలీసులు వారిద్దరిని శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు వివరాలిలా ఉన్నాయి. తూటికుంట్లకు చెందిన గుమ్మా నాగరాజు(30) గత ఏడాది అక్టోబర్‌ 31న మృతి చెందాడు. ఆయన మృతదేహం పక్కన అన్నం పడేసి ఉండడం, మద్యం గ్లాసులో నురగలను గుర్తించిన కుటుంబీకులు అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు. నాగరాజు భార్య ప్రవర్తనపై అనుమానాలను వెల్లడించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాగరాజు భార్య ఉమాశ్రీ కదలికలు ఆరా తీస్తూ విచారణ చేపట్టగా ఆమెకు రాంబాబుతో వివాహేతర సంబంధం ఉందని తేలింది. వీరిద్దరిని గతంలోనే అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది.

అయితే, నాగరాజు శరీర భాగాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించగా నివేదిక శనివారం వచ్చింది. ఆయన శరీర భాగాల్లో విషం ఆనవాళ్లు ఉన్నట్లు తేలగా పోలీసులు ఉమ, రాంబాబును అదుపులోకి తీసుకుని వివరాలు వెల్లడించారు. నాగరాజు భార్య ఉమాశ్రీ,కి రాంబాబు వివాహేతర సంబంధం కొనసాగుతుండగా ఆయనను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం విషాన్ని సిద్ధం చేసుకున్నారు. నాగరాజుకు మద్యం సేవించే అలవాటు ఉండడంతో అక్టోబర్‌ 31న ఆయన ఇంట్లోనే మద్యం తాగుతున్నాడు. ఇదే అదునుగా ప్రియుడు తెచ్చి ఇచ్చిన విషాన్ని ఉమాశ్రీ ఆహారంతో పాటు మద్యంలో కలపగా ఆయన మృతి చెందాడు. ఆపై ఏమీ తెలియనట్లు వ్యవహరించినా కుటుంబీకుల అనుమానంతో కేసు ఛేధించిన పోలీసులు ఉమాశ్రీ, రాంబాబును హత్య కేసులో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మధిర సీఐ మురళి తెలిపారు.