అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించి భర్త మృతి చెందగా విషయం తెలిసి వేదనకు గురై భార్య అకస్మాత్తుగా కుప్పకూలింది. పలువురిని కంటతడి పెట్టించిన ఈ ఘటనతో మచ్చాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి , గ్రామానికి చెందిన నీరటి సారయ్య (58)-లచ్చక్క (54) దంపతులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వారికి ముగ్గురు సంతానం. ముగ్గురి వివాహాలు వైభవంగా జరిపించారు. కొడుకులు, కోడండ్లు, వారి పిల్లలతో కలిసి ఉమ్మడిగానే జీవిస్తున్నారు. గ్రామంలో అందరికీ తలలో నాలుకలా దంపతులు మెలిగేవారు. కాగా సారయ్య మూడ్రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబీకులు చికిత్స కోసం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చగా పరిస్థితి విషమించి సారయ్య బుధవారం రాత్రి మృతి చెందాడు.
ఆయన మృతదేహాన్ని కుటుంబీకులు ఇంటికి తీసుకురాగా శవం వద్ద కన్నీరు పెడుతూనే అతని భార్య లచ్చక్క కుప్పకూలింది. ప్రాణాలు విడిచింది. దీంతో మృతుల కుటుంబీకులు, ఇరుగు పొరుగు, గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. దంపతులు జీవితాంతం కలిసి ఉండి చివరకు కలిసే చనిపోయారంటూ పలువురు కంటతడి పెట్టారు.