వరంగల్ కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మడిపడ్డారు. గవర్నర్ తన ప్రసంగంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోనే చదివారని గండ్ర విమర్శించారు. దీనిపై స్పందించిన సీఎం మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ ప్రసంగిస్తారని అన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అక్కడి గవర్నర్లు కాంగ్రెస్ మేనిఫెస్టోనే చదువుతారని, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఇక్కడ గవర్నర్ ప్రసంగం టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోనే ప్రతిబింబిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలుచేసి తీరుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. గత టర్మ్‌లో మ్యానిఫెస్టోలో లేకపోయినా 72 పథకాలు అమలుచేశామన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్‌ ఆలోచన మారడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే రుణమాఫీ చేస్తామని, ఈసారి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రూ.24 వేల కోట్ల రైతు రుణాలు ఉంటాయని అంచనా వేసినట్లు చెప్పారు. రైతు రుణమాఫీపై విధివిధానాలు రూపొందిస్తున్నామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.