ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన మెడికల్‌ స్టోర్‌ నిర్వాకం బయటపడింది. కాలం చెల్లిన మందులను అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు షాప్ యజమాని. తాజాగా ఆ మందుల దుకాణంలో మాత్రలను కొనుగోలు చేసి వాటిని ఉపయోగించడంతో ఓ గర్భిణి తీవ్ర ఆస్వస్థతకు గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామానికి చెందిన సంగీత గర్భిణి అయిన తరువాత రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగా ఆటో నగర్‌లో ఉన్న సిరి హాస్పిటల్‌కు వెళ్లింది.

అక్కడ వైద్య పరీక్షలు అనంతరం డాక్టర్‌ సూచన మేరకు అదే ఆసుపత్రిలో ఉన్న మెడికల్‌ షాపులో ముందులు కొని ఇంటికి వెళ్లాక వేసుకుంది. ఒక ట్యాబ్‌లెట్‌ వేసుకోగానే స్పృహతప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులకు ఆమె వేసుకున్న మందులపై అనుమానం రావడంతో వాటిని పరిశీలించగా ట్యాబ్‌లెట్స్‌ అన్నీ పాడైపోయి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేయించి మందులు కొన్న మెడికల్‌ షాపుకు వెళ్లి నిలదీస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో గర్భిణి భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యకు ఏమైనా జరిగి ఉండి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశాడు. మెడికల్‌ షాపు నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగాడు…