ప్రస్తుతం స్టార్స్ రీయూనియన్ చిరంజీవి కొత్త ఇంటిలో జరిగినట్టు సమాచారం. జూబ్లీహిల్స్‌లో కొత్త ఇంటిని చిరంజీవి నిర్మిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఇంట్లో చిరంజీవి శనివారం గృహ ప్రవేశం చేశారని, రాత్రి అక్కడే తన సినీ మిత్రులందరికీ చిరంజీవి పార్టీ ఇచ్చారని సమాచారం. దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇంటిని చిరంజీవి నిర్మించారట.

Advertisement

త్వరలో 80ల నాటి నటీనటుల కలయికను తన ఇంట్లో నిర్వహిస్తున్నానని, ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నటి రేఖను ఆహ్వానించానని ఇటీవల జరిగిన ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఆ వేడుకలు శని, ఆదివారాల్లో మెగాస్టార్ ఇంట జరిగాయి. 80వ దశకంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సినీ తారలు అంతా చిరంజీవి ఏర్పాటుచేసిన రీయూనియన్ ఫంక్షన్‌లో పాల్గొన్నారు.

చిరంజీవి ఆతిథ్యం:

1980ల నాటి సినీ తారలు ఏటా ఏదో ఒక చోట కలిసి సందడి చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈసారి ఈ వేడుకలకు మెగాస్టార్‌ చిరంజీవి ఇల్లు వేదికైంది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో 80ల నాటి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటులు ఒక చోట కలిసి సందడి చేశారు. ఎంత మంది పాల్గొన్నారు, పాల్గొన్న నటీనటుల పూర్తి ఏంటి వంటి వివరాలు ఇంకా తెలియకపోయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల ద్వారా పాల్గొన్నవారిలో కొంత మంది వివరాలు తెలుస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి మోహన్‌లాల్ కనిపించారు. ‘నా అమేజింగ్ ఫ్రెండ్ చిరంజీవితో నేను’ అని ట్వీట్‌లో మోహన్ లాల్ పేర్కొన్నారు. ఈ ఫొటోలో చిరంజీవి కుర్చీలో కూర్చొని ఉండగా మోహన్‌ లాల్ ఆయన్ని వెనుక నుంచి ఆప్యాయంగా భుజాలపై నుంచి రెండు చేతులు వేసి పట్టుకున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల ద్వారా మోహన్ లాల్, రాధిక, శరత్ కుమార్, ప్రభు, రెహమాన్, భానుచందర్ ఈ వేడుకల్లో పాల్గొన్నట్టు స్పష్టమవుతోంది. అయితే, వీరితో పాటు రేఖ, వెంకటేష్, నరేష్‌, సురేష్‌, జయసుధ, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్‌, జాకీ ష్రాఫ్‌ తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరుకాలేదని తెలిసింది. ఆయన ‘దర్బార్’ సినిమాతో బిజీగా ఉండటంతో రాలేదట. మొత్తం మీద 40 మంది తారలు పాల్గొన్నట్లు సమాచారం.