జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి 40 మందికి పైగా CRPF‌ జవాన్లను పొట్టనబెట్టుకుంది. కానీ ఓ జవాను చివరి నిమిషంలో ఈ దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలను దక్కించుకున్నాడు. అతనే మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ప్రాంతానికి చెందిన థాకా బేల్కర్‌. ఫిబ్రవరి 14న ఇతర సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో పాటు బేల్కర్‌ కూడా వెళ్లాల్సి ఉంది. కానీ ఎప్పటి నుంచో ఆయన సెలవులు అడుగుతున్నారని చివరి నిమిషంలో అధికారులు అనుమతి ఇవ్వడంతో బేల్కర్‌ తిరుగు ప్రయాణమై ప్రాణాలు దక్కించుకున్నారు.

Advertisement

ఫిబ్రవరి 24న బేల్కర్‌ వివాహం జరగనుంది. సెలవులు దొరికిన సంతోషంతో ఇంటికి వెళ్లిన బేల్కర్‌ , ఉగ్ర ఘాతుకంలో తన తోటి ఉద్యోగులు అమర వీరులయ్యారని తెలిసి ఎంతో బాధపడ్డారు. ఇప్పటికీ ఆయన ఈ షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నట్లు బేల్కర్‌ కుటుంబీకులు మీడియా ద్వారా వెల్లడించారు. ‘పెళ్లి వేడుక నిమిత్తం ఇంటికి వచ్చిన బేల్కర్‌ దాడి జరిగిందని తెలిసినప్పటి నుంచి ఆ షాక్‌తో ఇప్పటివరకూ మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గురువారం ఇతర జవాన్లతో పాటు బేల్కర్‌ కూడా బస్సు ఎక్కాడు. బస్సు మరికాసేపట్లో బయలుదేరుతుందనగా అధికారులు సెలవులు ఇస్తున్నట్లు సమాచారం అందించారు. దాంతో ఇతర జవాన్లకు వీడ్కోలు చెప్పి ఇంటికి బయలుదేరాడు. కానీ అదే వారికి చివరి వీడ్కోలు అవుతుందని బేల్కర్‌ ఊహించలేకపోయాడు. పెళ్లి జరగబోతోందన్న ఆనందం అతనిలో ఏమాత్రం లేదు’ అని బేల్కర్‌ సోదరుడు అరుణ్‌ వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం బేల్కర్ సీఆర్‌పీఎఫ్‌లో చేరారు. ఎనిమిది నెలల క్రితమే ఆయనకు వివాహం కుదిరింది. అందుకే కాస్త ముందుగానే సెలవులకు దరఖాస్తు చేసుకున్నారు.