ఓ మహిళ కట్టుకున్న పట్టుచీర ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంతో చిరగటంతో వినియోగదారుల ఫోరం రవాణా సంస్థకు రూ.3వేల జరిమానా విధించింది. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండకు చెందిన కట్టెకోల నరసింహారావు, వాణిశ్రీ దంపతులు హైదరాబాద్‌లో వివాహానికి హాజరయ్యేందుకు 2018 ఆగస్టు 26న ఇక్కడి బస్టాండ్‌లో సూపర్‌లగ్జరీ బస్సు (టీఎస్‌05జెడ్‌ 0188) ఎక్కారు. బస్సు ప్రవేశద్వారం వద్ద బయటకు తేలిన రేకు తగిలి వాణిశ్రీ పట్టుచీర కొంచెం చిరిగింది. తర్వాత బస్సు ఎక్కిన మరో మహిళ చీరా అలాగే చిరిగిపోయింది.

ఆరేకును సరిచేయాలని డ్రైవర్‌కు నరసింహారావు దంపతులు చెప్పగా అది డిపో సిబ్బంది పని అని బదులిచ్చారు. డిపో మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో నరసింహారావు నల్గొండలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. టికెట్‌, బస్సు, బయటకు తేలిన రేకు, చిరిగిన చీర ఫొటోలను సాక్ష్యంగా సమర్పించారు. విచారణ చేపట్టిన ఫోరం. ఆర్టీసీ లోపాలను ధ్రువీకరించింది. పట్టుచీరకు రూ.2 వేలు, ఇతర ఖర్చులకు మరో రూ.1,000 జరిమానాను ఈ నెల 18న విధించింది.