అందం విషయంలోనో, కట్నం వ్యవహారంలోనో తలెత్తిన పొరపొచ్చాలతోనో పెళ్లిళ్లు రద్దు చేసుకోవడం మనం అక్కడక్కడా వింటుంటాం.. చూస్తుంటాం. కానీ, చీర నాణ్యత బాగాలేదన్న కారణంతో ఏకంగా వివాహాన్నే రద్దు చేసుకుందో కుటుంబం. ఈ అరుదైన ఘటన కర్ణాటకలోని హసన్‌ సమీపంలోని ఓ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

Advertisement

వివరాలు: పెళ్లికొడుకు బీఎన్‌ రఘుకుమార్‌, వధువు బీఆర్‌ సంగీత ఇద్దరిదీ ఒకటే గ్రామం. గత ఏడాది కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు వీరి ప్రేమకు పచ్చజెండా ఊపడంతో చివరకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే, వివాహానికి ముందు రోజు జరిగిన కార్యక్రమం సందర్భంగా వధువు చీర నాణ్యత విషయంలో వరుడి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తంచేశారు.

ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణతో వారు ఏకంగా పెళ్లినే రద్దుచేసుకున్నారు. దీంతో పెళ్లికుమార్తె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పెళ్లికొడుకు , అతడి తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. రఘుకుమార్‌ పరారీలో ఉన్నాడనీ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హసన్‌ ఎస్పీ శ్రీనివాస్‌ గౌడ వెల్లడించారు. పెళ్లికొడుకు తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.