చేపమాంసాన్ని క్రమంతప్పకుండా ఆహారంగా తీసుకుంటే పెద్దపేగు క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని క్యాన్సర్‌ రీసెర్చి సెంటర్‌లో చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్లు వారు తెలిపారు. వారానికి సూమారుగా మూడుసార్లు క్రమం తప్పకుండా చేపమాంసాన్ని ఆహారంగా తీసుకున్నట్లయితే పెద్దపేగు క్యాన్సర్‌తో పాటు పురీషనాళానికి సంబంధించి వచ్చే క్యాన్సర్‌ రాకుండా 12 శాతం వరకు నియంత్రించవచ్చని వారు వివరించారు. చేపలో ఉండే ఓమేగా-3 అమ్లాలు ఈ చర్యలో కీలకపాత్ర వహిస్తాయన్నారు. అంతేకాక చేపలో అత్యధికంగా పోషక పదార్థాలు ఉంటాయని, విటమిన్‌ ‘డి’ లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే వాటిలో ఉండే ఓమేగా-3 ఫాటీ అమ్లాలు మానసిక ఒత్తిడి, మానసిక వ్యాకులత, గుండెనొప్పి, అధిక రక్తపోటు వంటి వ్యాధులు రాకుండా నియంత్రిస్తాయని తెలిపారు.