{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584424430485","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584424390306","source":"other","origin":"unknown"}

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ ఘటన తరహాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఆమె తలపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఆమెను ఇతర ప్రాంతం నుంచి తీసుకొచ్చి అత్యాచారం చేసి, హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ రోజు ఉదయం 6 గంటలకు స్థానికులు ఓ బ్రిడ్జి కింద ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

మహిళకు సంబంధించిన వస్తువులు కానీ, దుస్తులు కానీ ఘటనా స్థలంలో లభించకపోవడంతో ఆమె వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. చేవెళ్ల డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైన యువతి ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనేది తెలిస్తే నిందితులను త్వరగా గుర్తించేందుకు అవకాశముంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే, హత్యకు గురైన యువతి ఏ ప్రాంతానికి చెందినదో తెలియడం లేదని పోలీసులు తెలిపారు. ఆమె సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తాము అనుమానిస్తున్నట్లు తెలిపారు. మిస్సింగ్ కేసులేమైనా ఉన్నాయా అని ఆరా తీసున్నామని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.