ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఓ యువతి అదృశ్యమైన ఘటన చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఏఎస్‌ఐ లాలయ్య తెలిపిన వివరాల ప్రకారం: దిల్‌సుఖ్‌నగర్‌ దుర్గానగర్‌లో కాటిరెడ్డి అంజిరెడ్డి హాస్టల్‌ నిర్వహిస్తున్నాడు. ఇతని మేనమామ కూతురు మాధవీలత(19) పంజగుట్టలోని మరో హాస్టల్‌లో అమ్మమ్మ వద్ద ఉంటోంది. కాగా, ఇటీవల ఈమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. శనివారం ఉదయం మాధవిలత పంజగుట్టలో మెట్రో రైల్‌ ఎక్కి దిల్‌సుఖ్‌నగర్‌లోని హాస్టల్‌కు వచ్చింది. అక్కడి నుంచి తమ పిన్ని ఇంటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు.

ఆమె కోసం మేనబావ అంజిరెడ్డి బంధు,మిత్రులను వాకబు చేసినా ఆచూకీ దొరకలేదు. దీంతో సోమవారం చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 24న మాధవీలతకు పెళ్లి నిశ్చితార్థం కావాల్సి ఉందని, అయితే, ఈ పెళ్లి ఇష్టంలేని గతంలో చెప్పిందని, ఈ కారణంతోనే అదృశ్యమై ఉంటుందని అంజిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.