కరీమాబాద్: వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్ తోటలో ఆడెపు వెంకటేశ్(28), అలియాస్ సాంబరాజు అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు జనం చూస్తుండగా నమ్మించి కొబ్బరిబొండాల కత్తితో దాడిచేసి హత్య చేశారు. నడిరోడ్డుపై జరిగిన ఈ హత్య వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సంచలనంగా మారింది. కొన్ని సంవత్సరాలుగా నిశబ్దంగా ఉన్న ఈప్రాంతంలో మరో మారు హత్య జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మిల్స్‌కాలనీ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. 23వ డివిజన్ ఎస్‌ఆర్‌ఆర్ తోట ప్రాంతానికి చెందిన ఆడెపు వెంకటేశ్(28) అలియాస్ సాంబరాజు కొంతకాలం పాటు వరంగల్‌లోని ఓ బంగారం దుకాణంలో కారు డ్రైవర్‌గా పని చేశాడు. ఇటీవల తండ్రి ఉద్యోగ విరమణతో వచ్చిన డబ్బుతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ సంపత్ అనే వ్యక్తితో ఉన్న స్నేహం, అతని భార్యతో వివాహేతర సంబంధానికి దారితీయగా, విషయం తెలిసిన సంపత్ వెంకటేశ్‌ను హెచ్చరించాడు. కొన్ని రోజులుగా వరంగల్ వదిలి దూరంగా వెళ్లిన వెంకటేశ్ రెండు రోజుల క్రితం వరంగల్‌కు వచ్చాడు. విషయం తెలిసిన సంపత్ అనే ఆటో డ్రైవర్ అప్పటికే హెచ్చరించినా మళ్లీ ఇక్కడే తిరుగుతున్నాడన్న కోపంతో మరో ఇద్దరితో కలిసి ఎస్‌ఆర్‌ఆర్ తోట పుట్నాల మిల్లు దగ్గర రోడ్డుపై మాట్లాడదామని పిలిచి జనమంతా చూస్తుండగా కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశారు. తలపై, మెడపై తీవ్ర గాయాలవడంతో వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రవళి, ఇద్దరు ఏడాదిన్నర వయసున్న ఆడపిల్లలు, రెండున్నర సంవత్సరాల వయసున్న కుమారుడున్నారు. వెంకటేశ్ మృతి విషయం తెలిసి అతని భార్య, కుటుంబసభ్యులకు సంఘటన స్థలానికి వచ్చి భోరున విలపించారు. తన భర్తను ఆటో డ్రైవర్ సంపత్ హత్య చేశాడని, అతని భార్య వల్లనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. సంపత్ నివాసముంటున్న అద్దె ఇంటిపైకి దూసుకు రాగా, మిల్స్ కాలనీ పోలీసులు అడ్డుకున్నారు. నిందితుడిని తెల్లారేలోగా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చి వారిని అక్కడ నుంచి పంపించారు. హత్య విషయం తెలిసి ఎస్‌ఆర్‌ఆర్ తోట, కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వారు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ
హత్య సంఘటన ప్రాంతాన్ని వరంగల్ డీసీపీ నరసింహ, ఇన్‌ఛార్జి ఏసీపీ నర్సింగ్ సందర్శించి పరిశీలించారు. దాడి చేయడానికి ముందు, తర్వాత పరిస్థితులను తెలుసుకున్నారు. మృతదేహానికి పంచనామా చేసిన అనంతరం ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో వెంకటేశ్‌ను హత్యచేసిన సంపత్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు.