గ్రామాలకు ప్రథమ పౌరులుగా ఉండే సర్పంచ్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ జనం మెచ్చే పాలన అందించాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ సూచించారు. మండలకేంద్రంలోని తిరుమల గార్డెన్ సోమవారం సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచాయతీ పాలకులను స్వయంగా సన్మానించారు. అనంతరం జరిగిన సభలో ఎర్రబెల్లి మాట్లాడుతూ సర్పంచ్ గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

పల్లెల్లో ఆదర్శపాలన అందిస్తే ఫలానా సర్పంచ్ హయాంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారని హితవు పలికారు. ఇంటిని చూసి ఇల్లాలును చూడు అనే నానుడి ఉందని, అదే రీతిలో గ్రామాన్ని చూస్తే సర్పంచ్ పనితనం తెలిసిపోతుందన్నారు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు, ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. బాధ్యతలను విస్మరించొద్దని, ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా కార్యాచరణతో ముందుకెళ్లాన్నారు. గ్రామాల అవసరాలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తేవాలని, అభివృద్ధి విషయంలో తనను పూర్తిస్థాయిలో వాడుకోవాలన్నారు