తెలంగాణలోని జనగామలో దారుణం జరిగింది. చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళపై కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మండలంలోని శామీర్‌పేట జాతీయ రహదారి పక్కన కల్వర్టు కింద పడేశారు. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ శరీరంపై గాయాలు ఉండడంతో అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మహిళకు 14 ఏళ్ల క్రితం వివాహమైందని, ఆమెకు ఓ కుమార్తె కూడా ఉందని బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఆమె భర్త మరో మహిళతో హైదరాబాద్‌లో ఉంటున్నట్టు పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రి తన తల్లిదండ్రులు ఉండే నెల్లుట్ల నుంచి జనగామ బయలుదేరిన ఆమె మంగళవారం ఉదయం హత్యకు గురైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.