విమానాల్లో మాదిరిగా ఇక రైళ్లలోను ప్రయాణికులు షాపింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. జవనరి నుంచి రైళ్లలో ప్రయాణికులు సౌందర్య ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఫిట్‌నెస్ టూల్స్ కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించి పశ్చిమ రైల్వే ముంబయి డివిజన్ ఓ ప్రైవేటు కంపెనీకి ఐదేళ్ల పాటు కాంట్రాక్టు కింద లైసెన్సు ఇచ్చింది.
16 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఐదేళ్ల పాటు సదరు కంపెనీ గృహోపకరణాలు, సౌందర్య ఉత్పత్తులతో పాటు ఇతర వస్తువుల విక్రయాలు జరపవచ్చు. అయితే. సదరు కాంట్రాక్టర్ ఎటువంటి తినుబండారాలు, సిగరెట్లు, మత్తుపానీయాలు అమ్మడానికి వీల్లేదు. ఐదేళ్ల కాంట్రాక్టు విలువ రూ.3.5కోట్లు. ఏయే వస్తువులను విక్రయిస్తున్నారనే దానికి సంబంధించిన చార్ట్‌తో యూనిఫాం ధరించిన ఇద్దరు సిబ్బంది అమ్మకాలు జరుపుతారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రైళ్లలో ఈ విక్రయాలు జరపాల్సి ఉంది. డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగించి ప్రయాణికులు ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. రైళ్లలో ఉత్పత్తుల గురించి బిగ్గరగా అరుస్తూ ప్రచారాలు నిర్వహించడాన్ని నిషేధించినట్లు సదరు అధికారి తెలిపారు. మొదటి దశలో భాగంగా రెండు రైళ్లలో ఈ సదుపాయాన్ని తీసుకురానున్నారు. ఆ తర్వాత దశల వారీగా ఇతర రైళ్లలోను ప్రవేశపెట్టనున్నారు