విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ నూతి రామ్మోహనరావు కుమారుడు వశిష్టపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. భార్య సింధుశర్మ ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని సీసీఎస్‌ మహిళా పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. జస్టిస్‌ నూతి రామ్మోహనరావు, ఆయన భార్య జయలక్ష్మి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. పెళ్లైనప్పటి నుంచి తన భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారని, తరచూ కొట్టేవారని సింధు కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వశిష్ట, సింధులకు మహిళా పోలీస్‌ ఠాణా అధికారులు రెండుసార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. శనివారం మరోసారి ఇద్దరినీ పిలిపించారు. ఈసారి కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. ఆరు రోజుల క్రితం దారుణంగా చిత్రహింసలు పెట్టారంటూ సింధు పోలీసులకు తన శరీరంపై ఉన్న గాయాలను చూపించడంతో వశిష్ట, అతడి తల్లిదండ్రులపై ఐపీసీ 498-ఎ, 406, 323 సెక్షన్లతో పాటు వరకట్న వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్‌ మంజుల తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెల 20న వశిష్ట, అతడి తల్లిదండ్రులు తీవ్రంగా కొడితే సింధు జూబ్లీహిల్స్‌ అపొలో ఆసుపత్రిలో చేరిందంటూ ఆమె సన్నిహితులు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు విడుదల చేశారు. శనివారం రాత్రి మహిళా పోలీస్‌ ఠాణా వద్ద సింధు విలేకరులతో మాట్లాడారు.