ముంబయికి చెందిన తేజస్వీ ప్రభుల్కర్ (21) అనే అమ్మాయికి ఒళ్లంతా టాటూలే. వాటి కోసం ఆమె కాలేజీ చదువు కూడా మానేసింది. శరీరంపై ఏకంగా 103 టాటూలతో ఇటీవల ‘లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు’ల్లోకి ఎక్కింది. ఆమె మాటల్లోనే వివరాలు తేలిపిన ప్రకారం, నేను చిన్నతనంలో రకరకాల బొమ్మలు గీసేదాన్ని. కానీ మా అమ్మ ‘ఈ టాలెంట్‌తో ఏదైనా ఉపయోగపడే పనిచేస్తే మంచిది’ అని నన్ను మందలించేది. చాలామంది నా పేరును ‘తేజస్విని, తేజశ్రీ’ అని తప్పుగా పలికేవారు. దాంతో నా పేరును స్పష్టంగా అందరికీ తెలియజేయాలనుకున్నా. అందుకోసం 17 ఏళ్ల వయసులోనే ‘తేజస్వీ’ అని నా పేరునే తొలి టాటూగా వేయించుకున్నా. ఆ తర్వాత నాకు క్రమంగా టాటూల మీద ఆసక్తి పెరిగింది. టాటూలనే ప్రొఫెషన్‌గా ఎంచుకోవాలనుకున్నా.
అయితే నా నిర్ణయం మా ఇంట్లోవాళ్లకు నచ్చలేదు. మా అమ్మ నన్ను పచ్చబొట్లు పొడిపించుకోనిచ్చేది కాదు. ఒళ్లంతా టాటూలుంటే నాకసలు పెళ్లికాదని అమ్మానాన్న ఆందోళన చెందేవారు. వారెన్ని చెప్పినా నేను మాత్రం నా పట్టువీడలేదు. టాటూలపై నాకున్న ఆసక్తిని చంపుకోలేదు. వయసు, జెండర్, లుక్స్ చూసి ఒక వ్యక్తి గురించి అభిప్రాయానికి రావడం సరికాదు. నేను టాటూ ఆర్టిస్ట్‌గానే కాకుండా పెయింటర్, మోడల్‌గానూ రాణిస్తున్నాను. నా అభిరుచి నాకు తెలియకుండా రికార్డు సృష్టించి గుర్తింపు తెచ్చినప్పటికీ, నా ఒంటిపై మరిన్ని టాటూలు వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నా.