చండీగఢ్‌: డ్రగ్స్‌ కోరల్లో చిక్కితే జీవితం ఛిన్నాభిన్నం అవుతుంది. మత్తుపదార్థాలకు బానిసలై ఎంతోమంది యువత తమ కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో అక్రమంగా డ్రగ్స్ తీసుకుంటున్న బాధితుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోనే అందుకు నిదర్శనం. తూర్పు అమృత్‌సర్ నియోజకవర్గం మక్బూల్‌పూర్‌ ప్రాంతంలో ఓ యువతి డ్రగ్స్ మత్తులో విలవిల్లాడింది. రోడ్డుపై నిలబడిన ఆమె కనీసం అడుగు తీసి అడుగు వేయడానికే ఆపసోపాలు పడింది. కాలు కూడా కదల్చలేని స్థితిలో వణుకుతూ కన్పించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆదివారం స్థానికంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ముగ్గురు నిందితుల నుంచి నార్కోటిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఐదు వాహనాలను కూడా సీజ్ చేశారు. వీటిని దొంగిలించి ఉంటారని అనుమానిస్తున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన కేసులతో మక్బూల్‌పురా ప్రాంతం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ అధికారులు ఎన్నో డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇక్కడ ఎంతో మంది యువత డ్రగ్స్‌కు బాధితులయ్యారు.