డ్రైవింగ్‌లైసెన్స్ రిన్యూవల్ చేయించేందుకు ఆర్టీఏ కార్యాలయానికి బయలుదేరిన అత్తాకోడల్లు రోడ్డు ప్రమాదం  మృత్యువాత పడ్డారు. వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఆక్టివా వాహనాన్ని ఢీకొనడంతో ఆ ఇద్దరు మహిళలు సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాగన్నగూడ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. సిఐ నరేందర్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కొత్తపేటలో నివాసముండే టి.రమ(54) ఓ బ్యాంకు ఉద్యోగి . ఆమె కుమారుడైన సంతోష్ ఓసాఫ్ట్‌వేర్ ఇంజనీర్. సంతోష్‌కు హిమజ(28)తో గత ఫిబ్రవరిలో వివాహమైంది. కాగా అత్తాకోడళ్లైన రమ, హిమజలు డ్రైవింగ్ లైసెన్స్ రిన్యూవల్ నిమిత్తం శనివారం తమ ఆక్టివా వాహనంపై నగరం నుంచి మన్నెగూడ సమీపంలోని ఆర్టీఓ కార్యాలయానికి బయలుదేరారు.

రాగన్నగూడ సమీపంలో వెనకనుంచి వేగంగా వస్తున్న ఓ టిప్పర్ వారు ప్రయాణిస్తున్న ఆక్టివాను ఢీకొట్టింది. దీంతో అత్తా కోడల్లిద్దరూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి టిప్పర్ చక్రాల క్రింద పడిపోయారు. టిప్పర్ చక్రాల క్రింద వారి దేహాలు నుజ్జునుజ్జయ్యాయి. తల, ముఖభాగాలు గుర్తుపట్టలేనంతగా చిద్రమయ్యాయి. ఈ ఘటనలో అత్తాకోడల్లిద్దరూ సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు. సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.