అన్నదమ్ముల మధ్య కొన్నాళ్లుగా నలుగుతున్న భూ వివాదం సోమవారం తీవ్రరూపం దాల్చింది. ఈ వివాదంలో అన్నకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఏకంగా బైక్‌పై వస్తున్న తమ్మునిపై ట్రాక్టర్‌తో ఢీకొని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీగ్రాయాల పాలయిన తమ్ముడిని రావికమతం ఆస్పత్రి నుంచి నర్సీపట్నం ఆస్పత్రికి చికత్స నిమిత్తం తరలించారు. రావికమతం ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు: అప్పలమ్మపాలెం గ్రామానికి చెందిన అన్న మడకా రమణ, తమ్ముడు సింహాద్రినాయుడుకు మధ్య కొంత కాలంగా ఆస్తి వివాదాలు ఉన్నాయి.

Advertisement

పలుమార్లు ఇద్దరూ గొడవ పడ్డారు ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం మేడివాడ గ్రామం పనిమీద వచ్చి తిరిగి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్న సింహాద్రినాయుడును ఎదురుగా ట్రాక్టర్‌పై వస్తున్న అతని అన్న ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. దీంతో సింహాద్రినాయుడు కింద పడడంతో చేతికి, ఒంటికి తీవ్రగాయాలయ్యాయి. బైక్‌ ట్రాక్టర్‌ కింద నలిగిపోయింది. గాయాల పాలైన అతనిని రావికమతం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు చేయించి ఆపై నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.