తన మెడలో వేసుకున్న తాడు, ఉరితాడులా బిగుసుకుంది ఓ ఐదేళ్ల బాలుడికి. సమయస్ఫూర్తితో ఆ బాలుడి ప్రాణాలను కాపాడింది సోదరి. తమ్ముడి ప్రాణాలను కాపాడిన అక్కపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇస్తాంబుల్‌లోని ఓ భవనంలోని లిఫ్ట్‌లో ఐదేళ్ల బాలుడు, అతని అక్క, చెల్లి ఎక్కారు. అయితే బాలుడు మెడలో తాడు వేసుకుని లిఫ్ట్‌లోకి వచ్చాడు. ఆ లిఫ్ట్ కిందకు దిగగానే ఆ తాడు బాలుడి మెడకు ఉరితాడులా బిగుసుకుంది. ఈ విషయాన్ని గమనించిన అక్క.. అప్రమత్తమై లిఫ్ట్‌లోని ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కింది. అంతటితో ఆగకుండా తమ్ముడి కాళ్లను పైకి లేపి తాడు గొంతుకు బిగుసుకోకుండా చాకచక్యంగా వ్యవహరించింది.