హైదరాబాద్‌ : తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హెచ్‌బీకాలనీ, కృష్ణానగర్‌కు చెందిన అంప దివ్యజ్యోతి అలియాస్‌ ప్రభావతి (19) ప్రైవేటు ఉద్యోగి. అయితే మృతురాలు ఓ యువకుడిని ప్రేమిస్తుంది. అతడికి మరో అమ్మాయితో వివాహం జరిగింది. వివాహం జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా మృతురాలు అతనితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మనస్థాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.