తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు హిమాన్షు. ఆపదలో వున్నవాళ్ళను ఆదుకుని చిరుప్రాయం నుంచే తన విశాల హృదయాన్ని చాటుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు.

Advertisement

ఎవరు ఆపదలో వున్నా ఆదుకోవడంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ ముందుంటారు. ఇప్పుడు వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారు హిమాన్షు. రోడ్డు ప్రమాదంలో గాయపడి 12 ఏళ్లుగా ఇంటికే పరిమితమైన ఓ దివ్యాంగుడిని ఆదుకున్నారు హిమాన్షు. భద్రాచలంలోని రాజీవ్ నగర్‌లో నివాసం వుంటున్న నూకసాని శ్రీనివాస్ రావుకు రోడ్డు ప్రమాదంలో వెన్నుపూసకు తీవ్ర గాయమైంది. అప్పటినుంచి అతడు మూడు చక్రాల సైకిల్‌కు పరిమితమయ్యాడు.

తెలంగాణ ఎన్నికల సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. ‘కేసీఆర్ మూడు వేల పింఛన్ ఇవ్వకున్నా పర్వాలేదు. ఇప్పుడిస్తున్న దానితోనే మా కడుపు నిండుతోంది. మళ్లీ కేసీఆరే సీఎం కావాలి’ అని ఆ వీడియోలో తెలిపాడు. ఈ వీడియోను హిమాన్షు చూశారు. వెంటనే శ్రీనివాసరావు గురించి ఆరా తీశారు. భద్రాచలంలో తమకు దగ్గరగా వుండే కేవీ దయాకర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అతడికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆయన హామీ మేరకు శ్రీనివాసరావు చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుతున్న హిమాన్షుకు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తాత కేసీఆర్‌తో మాట్లాడి తమ కుటుంబానికి పూర్తిస్థాయిలో సాయం అందించేందుకు కృషి చేస్తానని హిమాన్షు తమతో చెప్పినట్టు శ్రీనివాస్ భార్య పేర్కొన్నారు.