మనవరాలిని లాలించాల్సిన వయస్సులో కామంతో కళ్లుమూసుకుపోయి తాతే కాటేశాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాలకు చెందిన బాలిక (15) జిల్లాలోని ఓ కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గత నెల రోజులుగా తరచూ అనారోగ్యానికి గురి కావటం.. నెలసరి తప్పడంతో ఉపాధ్యాయులు స్థానిక వైద్యులకు చూపించారు. బాలిక గర్భం దాల్చినట్లు తెలియడంతో తల్లిదండ్రులను పిలిచి అప్పగించారు. బాలికను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చూపించటంతో నాలుగు నెలల గర్భిణిగా తేల్చారు. హతాశులైన తల్లిదండ్రులు బాలికను నిలదీయడంతో విశ్రాంత ఉపాధ్యాయుడైన ‘తాతే చేశాడు’ అని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన బాలికను తాత (తండ్రి చిన్నాన) ఆమెను లొంగదీసుకున్నాడని చెప్పడంతో అమాయకులైన తల్లిదండ్రులకు తమ కుమార్తె పరిస్థితి చూసి మతి తప్పినట్లయ్యింది. శనివారం రాత్రి 9.30 గంటలకు తర్వాత బాలిక జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.